English
Download App from store
author
kavi Ramya
I enjoy reading and writing. My favorite genres are Children, Comedy, Drama, Fantasy, Fiction, Inspiration, Love, Mythology, Romance, Spiritual, Thriller. I have been a part of the Kahaniya community since October 7, 2020.
user
kavi Ramya
పేదరాసి పెద్దమ్మ కధ!!
నీతి కధ
  101 Views
 
  6 Mins Read
 
  2

పిల్లలూ! పెద్దలూ!! రండీ! రారండీ!! నేనెవరో తెలుసా.. అందరూ నన్ను పేదరాసి పెద్దమ్మా అంటారు..నేను చాలామందికి తెలుసు. మీరు కూడ ఎక్కడో ఒక చోట నా గురించి వినే వుంటారు. వినకపోయిన పర్లేదురా అబ్బీ!అమ్మీ!! ఇప్పుడు వింటారుగా! నేను బాగా కథలు చెబుతానని నన్ను ఇష్టపడ్డవాళ్ళు అంటూ వుంటారు. నేను ఎక్కువగా చెప్పేది నీతి కథలు. మరి మీరు సిద్ధమా నా దగ్గర నుండి ఒక కథ వినడానికి? అయ్యో నా మతిమరుపు పండా!(మండా అనుకోదు ఈ అవ్వ) మీరు వినలేరు కదూ.. కానీ చదవగలరూ కదా! రండి అయితే చదివేద్దురూ!!!😊 అనగనగనగా కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. అలాంటి ఆ అడవిలో ఎన్నో రకాల ప్రాణులు నివసిస్తూ వుండేవి.. ******* "అదేంటి అవ్వా? చీమలు దూరని అడవి,కాకులు దూరని అడవి అని చెప్పి ..ఇప్పుడు మళ్ళీ బోలెడు ప్రాణులు ఉంటాయి అంటున్నావు?" అంటూ ఒక బాబు పేదరాసి పెద్దమ్మని అడగగా "ఎవరది?"అంటూ వెనక్కి తిరిగి చూసి "ఒరేయ్ మనవడా! నువ్వట్రా! రా రా బఢవాయ్! చింటూ కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అంటే బాగా దట్టంగా ఉన్న అడవి అని అర్ధం.." అంటూ దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది పెద్దమ్మ.. "సరే అవ్వా! చెప్పు చెప్పు.." అంటూ తొందరపెడుతున్న చింటూ కేసి చూసి బోసి నవ్వులు నవ్వుతూ "అలాంటి ఆ అడవిలో ఒక మంత్రగత్తె వుండేది. ఆ అడవిని మొత్తం తనే శాశిస్తూ వుండేది. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని పిల్లి లేక కుక్కలు గా మార్చేసి పెంపుడు జంతువులిని చేసేది. ఎన్నో ప్రాణులు తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బ్రతికేవి" అంటూ చెబుతున్న పెద్దమ్మని ఆగమని చేయి ఎత్తి "అవ్వా నాకో సందేహం! అంత చెడ్డ మాంత్రికురాలు ఉన్న అడవిలో వీరు వుండడం అవసరమా? వేరే అడవికి వెళ్ళొచ్చుగా! అక్కడైతే ఏ ఇబ్బంది వుండదేమో!" అంటూ చింటూ అనగా "రేయ్ మనవడా! సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి లేదా మన సమయం అనుకూలించే దాకా సమస్యతో నడవాలి మరియు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేయాలి. అంతేగాని పారిపోవడం లేదా తప్పించుకు తిరగడం పరిష్కారం కాదు. రేపు అదే సమస్య మళ్ళీ నీకు మరో రూపంలో ఎదురుగా నిలిస్తే??" అంటూ పెద్దమ్మ కను బొమ్మలు ఎగరేసి అడగగా "అవును అవ్వా! సమస్యని గెలిస్తే మళ్ళీ అలాంటిదే ఎదురైతే మనకి దాన్ని అరికట్టడం సులువు. భలేగా చెప్పావు. ఇక కధ చెప్పు నేను మధ్యలో ప్రశ్నలు అడగను. ఆఖరిన అడుగుతాను!! ఎప్పటిలానే 'ఊ' కొడతాను అంతే." అంటూ చింటూ ముసి ముసి నవ్వులు నవ్వి శ్రద్ధగా వినడం మొదలెట్టాడు. పేదరాసి పెద్దమ్మ చెప్పడం మొదలెట్టింది.. అలా ఆ మంత్రగత్తె అందరిని తన కనుసన్నల్లో పెట్టేది. అన్ని ప్రాణులు ఆ దేవుడిని ప్రార్ధిస్తూ "దేవుడా! మాకు ఈ బాధ నుండి ఉపశమనం కలిగించు...త్వరగా ఒక మార్గం చూపు..ఈ మంత్రగత్తె మాపై చేసే అరాచకాలు తట్టుకోలేకపోతున్నాము.." అంటూ మొరపెట్టుకునేవి. అలా ఆ అడవిని శాశిస్తూ తన రాక్షస ఆనందం మంత్రగత్తె పొందుతుండగా ఈ అడవికి కాస్త దూరంలోనే ఒక సుందరమైనా మరియు సుభిక్షమైన సామ్రాజ్యం వుండేది. ఆ రాజ్యం రాజు గారు ప్రతాపుడు చాలా మంచివారు. ప్రజలందరినీ తమ పిల్లల్లా చూసుకుంటూ ధర్మ పరిపాలన చేసేవారు. ఆయనకి ఒక కూమార్తె. ఆమె అందాల అపరంజి బొమ్మ. ఆమె పేరు సువర్ణ సుందరి. ఒకానొక సందర్భంలో తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఏదో విషయంపై తన ప్రాణ స్నేహితురాలితో వాదోపవాదాలు జరిగాయి. తన స్నేహితురాలు ఆవేశంలో "నువ్వంత ధైర్యవంతురాలివి అయితే మన రాజ్యానికి సమీపంలో వున్న అడవిలో ఒక రాత్రి వెళ్ళి అక్కడున్న మకరంద పువ్వు తీసుకు రా! అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు ధైర్యవంతురాలివి అని. అంతేగాని ఇలా ఊరికే గొప్పలు చెప్పుకుంటూ తిరగకు" అంటూ ఎగతాళి చేసింది. ఆ అవమానం తట్టుకోలేని సువర్ణ సుందరి వెంటనే సైన్యంతో బయల్దేరి రాజ్యాన్ని దాటి వెళ్ళింది మహారాజు అయిన తన తండ్రి ఆజ్ఞ లేకుండా! రాజకుమారి తన సైన్యంతో అడవిలో వెళ్లబోతుండగా అడవి బయట వున్నవారు హెచ్చరించారు "వద్దమ్మా! ప్రమాదం!" అని. అయినా వెను తిరగలేదు. పైగా "మీరు నాకు చెప్పేంతటివారు కారు! నేనూ రాకుమారిని!" అంటూ దూసుకుపోయింది. రాకుమారి కాస్త గర్వస్థురాలు. అందుకే ఎవరు చెప్పినా దానిని తర్కించుకుండా, ఉచితానుచితాలు ఆలోచించకుండా, తన ధోరణి తనదే అనే విధంలో పని చేసుకునిపోయేది. అదే ఆమెకు ముప్పుగా మారింది. జంకుతున్న సైనికులతో అడవిలో అడుగుమోపింది. తన రాకని పసిగట్టిన మాంత్రికురాలు అవకాశం కోసం కాపు కాసింది. తను అనుకున్నట్టే మకరంద పువ్వు చేజిక్కించుకుని తిరిగి అడవి దాటబోతుండగా తన సైన్యం కనుమరుగయ్యారు. సువర్ణ సుందరి భయంతో వణకసాగింది."అయ్యో! ఏమిటి ఇలా జరిగింది? అప్పటికీ అందరూ చెబుతూనే వున్నారు వద్దని! వారి మాట పెడచెవి పెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఏం చేయనూ?" అంటూ బిక్కు బిక్కుమని అడవి దాటే ప్రయత్నం చేస్తుండగా తాను ఎక్కిన గుర్రం తనని కింద పడేసి ఎటో పారిపోయింది. సువర్ణ సుందరికి భయం రెట్టింపు అయ్యింది. ఇక బయటికి పరిగెత్తే ప్రయత్నం చేయగా చెట్ల కొమ్మలు ఒకటినొకటి అల్లుకుని తన దారికి అడ్డు నిలిచి బయటకు వెళ్ళే మార్గం పూర్తిగా మూసేసాయి. ఆ దెబ్బకి సువర్ణ సుందరి ఏడుపు అందుకుంది. "హ్హ...హ్హ...నాకు కావాల్సింది నీ ఏడుపు ఇంకా భయం.. ఇంకా గట్టిగా ఏడు. ఇక నువ్వు నా బందీఖానాలో నా కట్టు బానిసవై బ్రతుకుతావు." అంటూ మంత్రంతో కట్టి పడేసి తన స్థావరానికి లాక్కెళ్ళింది ఆ మంత్రగత్తె. "నన్ను దయచేసి వదిలేయ్. నాకు భయమేస్తోంది..నేను ఇంకెప్పుడు ఈ అడవిలోకి రాను. అసలు ఈ అడవి గురించి ఆలోచించను. మా అమ్మానాన్నలు కావాలి. " అంటూ సువర్ణ సుందరి మొరపెట్టుకోగా మరింత రాక్షసంగా నవ్వుతూ "ష్. అరిచావో నేను నిన్ను పిల్లిలా మార్చేస్తాను. కావాలంటే ఇటు చూడు వాళ్ళు కూడా ఇంతకుముందు నీలాంటి మనుష్యులు. నీ సైనికులు కూడా అందులో వున్నారు...ఇలా వాళ్ళని మార్చేసాను. కాబట్టి నాతో జాగ్రత్త!" అంటూ భయపెట్టింది. అలా అనేసరికి రాకుమారి మారు మాట్లాడకుండా ఉలుకుపలుకు లేకుండా బొమ్మలా కూర్చునిపోయింది. రాజు తన గారాల పట్టి అలా బంధించబడింది అని గుప్తచర్యులు దగ్గర వార్త వినగానే తల్లడిల్లాడు. "క్షమించండి రాజా! నా మాట విని ఇలా సువర్ణ వెళ్లిపోతుంది అని ఆలోచించలేకపోయాను. నాదే తప్పు" అంటూ గుక్క పట్టి ఏడ్చింది తన కూతురి ప్రాణ స్నేహితురాలు. ప్రతాప మహారాజు "నీ తప్పు కాదులే తల్లి. నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను" అంటూ ఊరడించి తనని పంపగా "అదేంటి. తన వల్లేగా మన అమ్మాయి వెళ్ళింది ఆ అడవిలోకి!" అన్న మహారాణి సునందా దేవిని చూసి "తను అన్నంత మాత్రాన మన అమ్మాయి వెళ్ళక్కర్లేదుగా దేవి. చెప్పిన దాని గురించి ఆలోచించకుండా ఆవేశంలో, పంతంతో ,నెగ్గాలనే మొండితనంతో వెంటనే ఏ పనైనా పూనుకుంటే ఫలితం ఇలానే వుంటుంది. తనని(రాకుమారి స్నేహితురాలు) అని ఏం లాభం?" అని మహారాజు చెప్పారు. ఆ మాటలు విన్న రాణి కాదనలేకపోయింది. "రాజా! మీరు చెప్పినట్టు అన్ని రాజ్యాలకు విహంగాల(పక్షుల) ద్వారా వర్తమానం (మేఘసందేశం) పంపాము. రాకుమారి సువర్ణ సుందరిని క్షేమంగా మన రాజ్యానికి తీసుకొచ్చి మీకు అప్పగించినవారికి అర్ధ రాజ్యం ఇస్తామని లేఖలో తెలిపాము. ఇంక ఆ దేవునిపై భారం వేసి వేచిచూడడమే!!" అంటూ దిగాలుగా పలికాడు మహా మంత్రి ఖట్వాంగుడు. ***** ఒక మాసము గడిచింది.. కోటలో వారి అమ్మానాన్న, మంత్రగత్తె చెరసాలలో రాకుమారి సువర్ణ సుందరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిరాశా, నిస్పృహలతో కాలం వెళ్ళబుచ్చగా.. ఒక రోజు ఒక రాజకుమారుడు ఆ అడవిలో అడుగుపెట్టాడు. అడవి మార్గం బయట వున్నవారు తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. అతనికి వెళ్ళొద్దని చెప్పగా వినయంగా వారికి నమస్కరించి "రాకుమారిని కాపాడటానికి వెళుతున్నాను. మరే ఇతర ఉద్దేశ్యం లేదు. మీరు అంతా శుభమే జరగాలని నన్ను ఆశీర్వదించి పంపండి. నాకేం కాదు" అని అనగా వాళ్ళు దైవ దూతలుగా మారి "రాకుమారా! నీ పేరు?" అంటూ అడగగా "నరసింహ వర్మ!" అంటూ బదులు ఇచ్చాడు రాజకుమారుడు. వాళ్ళు సంతోషించి జరిగిందంతా చెప్పి "మమ్మల్ని మెప్పించావు నీ వినయంతో. నీకు శుభం జరుగుతుంది. ఈ ఉంగరం నీకు రాబోయే కాలంలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వెండి ఖడ్గం అందుకో! దీన్ని ఆ మంత్రగత్తె మీద ఒక్కసారి ప్రయోగించవచ్చు. ఆ తరువాత ఈ ఖడ్గం నిర్వీర్యం అయ్యి మాయమవుతుంది. కనుక జాగ్రత్తగా మసులుకో. ఈ కత్తి మంత్రగత్తెకి తాకగానే అది ఒక వేటు సుమా! ఆ తరువాత కత్తి నిష్ప్రయోజనం! విజయం నిన్ను వరించుగాక!" అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పి జరగబోయే శుభాన్ని తలచి వారు మాయమయ్యారు. అడవిలోకి అడుగుపెట్టగానే ఎప్పటిలాగే మంత్రగత్తె పసిగట్టింది. రాకుమారి కోసం వచ్చాడని కోపంతో దాడికి దిగబోయింది. మంత్రం ప్రయోగించి గొలుసులతో కట్టేసి తన స్థావరానికి తీసుకొచ్చింది. అక్కడ రాకుమారిని చూసిన నరసింహ వర్మ కోపోద్రిక్తుడయ్యాడు మంత్రగత్తె పై. "ధైర్య ముంటే నాతో  పోరాడి గెలు! అంతేగాని ఇలా దొంగ దెబ్బ తీసి సంబరపడకు. " అంటూ శౌర్యం చూపిస్తూ అనగా పట్టలేని కోపం వల్ల వచ్చిన ఆవేశంతో "అయితే సరే! రా యుద్ధానికి నేను సిద్ధం." అంటూ మంత్రాన్ని ప్రయోగించబోయింది మంత్రగత్తె. "ఆ...ఆగాగు! నువ్వు మంత్రాలు ఉపయోగిస్తే నేను నీ ముందు నిలబడగలనా! నువ్వు అసలే అందులో ఉద్దండురాలివి! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు చెప్పు!ఎలాగూ నువ్వే గెలుస్తావు. కనీసం నాకు వీర మరణం అందివ్వు. నా ఆఖరి కోరిక తీర్చవూ!" అంటూ సమయస్ఫూర్తి ఉపయోగించాడు రాజకుమారుడు నరసింహ వర్మ. పొగడ్తలకు పొంగిపోయి "అలాగే నీ ముచ్చట అదే ఆఖరి కోరిక నేనెందుకు కాదనాలి. చెప్పు ఎలా పొరాడమంటావు. నువ్వే చెప్పు?" అంటూ మదమెక్కిన మంత్రగత్తె అనగా "కత్తి యుద్ధం!" అంటూ రాజకుమారుడు నిరాడంబరంగా  అనగా.. కనికట్టు గుర్తించలేని మంత్రగత్తె ఒప్పేసుకుని కత్తితో సిద్ధమయ్యింది. పోరాటం మొదలైంది. సువర్ణ సుందరి యుద్ధం జరుగుతున్నా ఏం పట్టనట్టు అలా బొమ్మలానే కూర్చుంది. నిరాశ, నిస్పృహ నిండిన హృదయం పాశాణమైంది. వారి మధ్య పోరాటం "నువ్వా - నేనా?" అన్నంత ఉత్కంఠభరితంగా సాగింది. వన్య ప్రాణులు అక్కడ గుమిగూడి కన్నార్పకుండా చూస్తున్నాయి. పోరాటం మొదలులో మంత్రగత్తెదే పై చేయి కాగా గెలవబోతున్నాననే సంతోషంతో కన్నుమిన్ను కానలేదు. సరిగ్గా అదును చూసి ఆ కత్తితో మంత్రగత్తె పై ఒక్క వేటు వేసినట్టే వేసి వెనక్కి తగ్గాడు రాజకుమారుడు నరసింహ వర్మ. అప్రమత్తురాలై తుటిలో తప్పించుకున్న ప్రమాదం గురించి ఆలోచించి "అదేంటి నువ్వు నా పై కత్తి గాటు పెట్టలేదే?" అంటూ అడగగా "ఎలాగో మీరే గెలుస్తారుగా..అందుకే" అంటూ నిష్టూర్చాడు నరసింహ వర్మ. మనసులో మాత్రం "ఎందుకో నాకు అనిపిస్తోంది తొందరపడకూడదు అని. ఒకే వేటుకి నిన్ను అంతం చేయలేను. ముందు నీ గుట్టు కనిపెట్టాలి!" అనుకున్నాడు నరసింహ వర్మ. "అబ్బా! మాంచి రసపట్టులో వుండగా మొత్తం చెడగొట్టావు. అందులో ఆఖరి కోరిక అంటూ మెలిక పెట్టావు. " అని మంత్రగత్తె మనసులో "ఆఖరి కోరిక అని చెప్పినవారి కోరిక తీర్చకపోతే నేను మంత్రశక్తి కోల్పోతాను" అనుకుంటూ "ఇప్పుడు ఏంటి నీ నసా? సరే నన్ను గెలిచే మార్గం చెబుతా విను. నాది ఒక రూపం కాదురా డింభకా! నావి రెండు రూపాలు. " అంటూ రెండు రూపాలు చూపించింది మంత్రగత్తె. "ఇప్పుడు ఈ రెండు రూపాల్లో ఏది నా అసలు స్వరూపం కనిపెట్టి నీ కత్తితో దాడి చేయి అప్పుడే నన్ను నువ్వు సంహరించగలవూ. ఒక వేళ నువ్వు ఓడిపోతే జీవితాంతం నా దగ్గర ఊడిగం చేయాలి. ఏదో నన్ను గొప్ప మంత్రగత్తె అన్నావు కాబట్టి నీకీ అవకాశం ఇస్తున్నా" అంటూ అహంకారం మరియూ అతను "గెలవలేడులే" అన్న చిన్నచూపుతో నాట్యాలు చేస్తూ ఒకేలా నటించింది ఆ మంత్రగత్తె రెండు రూపాల్లో. నరసింహ వర్మ ఒక్క నిమిషం ఆలోచించి మంత్రగత్తె యొక్క ఒక రూపాన్ని కత్తిగాటుకి బలి ఇచ్చాడు. కత్తి వేటు పడగానే మంత్రగత్తె విలవిలాడుతూ "ఎలా కనిపెట్టావు?" అంటూ ఆశ్చర్యంగా అడగగా "అబద్ధానికి నీడ వుండదు. అదే నిజం నీడలా మన వెంటే ఉంటుంది. నీ అసలు స్వరూపం నిజం. దాని నీడ నాకు నీ స్థావర దీపపు వెలుగులో కనపడింది. మరో రూపం అబద్ధం కాబట్టి దానికి నీడ కనిపించలేదు." అంటూ సమాధానం ఇవ్వగా "భేష్ వీరా! కానీ నువ్వు నన్ను గెలవలేదు. ఎందుకంటే నేను అంతమవ్వగా నాతో పాటు నువ్వు విడిపిద్దామనుకున్న రాకుమారి ఎప్పటికి అలానే నా చెరసాలలో ఉంటుంది. తనని విడిపించాలంటే నేను తాకిన ముత్యపు ఉంగరం ఆమెకు ఇవ్వాలి" అంటూ కొన ఊపిరితో మంత్రగత్తె నవ్వుతూ అనగా "పొరబడ్డావు! ఇటు చూడు." అంటూ దైవ దూతలు ఇచ్చిన మేలిమి ముత్యపు ఉంగరం చూపగా "అయ్యె! తొందరపాటుతో కన్ను మిన్ను గానక మొత్తం వివరించేసాను. ఇందుకే అన్నారు మా పెద్దలు పొగడ్తలకి పొంగిపోయి ఎందుకు పొగిడారో ఆలోచించడం మానొద్దు అని. నాకు గుణపాఠం నేర్పావురా ఢింబకా!" అంటూ ప్రాణాలు వదిలింది మంత్రగత్తె. అన్ని ప్రాణులు ఆనందంతో కేరింతలు కొట్టాయి. మంత్రం వేయబడ్డ ప్రాణులు తిరిగి వాటి అసలు రూపాలు పొందాయి. ఉంగరం సాయంతో రాకుమారిని చెరసాల నుండి బయటకు తీసుకువచ్చి క్షేమంగా ఆమె తండ్రి అయిన ప్రతాపునికి అప్పజెప్పగా అన్న మాట ప్రకారం అర్ధ రాజ్యం ఇవ్వబోగా "నేను రాజకుమారిని కాపాడడానికి ఇదంతా చేసాను. రాజ్య కాంక్ష నాకు లేదు" అంటూ వెళ్లబోతుండగా "రాజకుమారా! నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. నీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి, గుండె ధైర్యం, సమస్యని ఎలా తెలివిగా ఎదుర్కోవాలి అనేవి నేర్చుకున్నాను. నీకు ఋణపడి వుంటాను. ఇక మీద నేను ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోను." అంటూ సువర్ణ సుందరి స్నేహబంధం ఏర్పర్చుకుంది అతనితో అలా రాజకుమారుడు ఆ రాజవంశం మన్నలను పొంది రాకుమారి స్నేహం మరియు ఆ రాజ్యప్రజలు ఇంకా వన్య ప్రాణుల ప్రేమాభిమానాలతో తన రాజ్యానికి పయనమయ్యాడు. ఎలా వుంది మనవడా ఈ కథ?? "బాగుంది అవ్వ. కానీ నాకొక సందేహం. ఆ రాజకుమారుడుకి దైవ దూతలు సహాయం చేసారు అన్నావు. అన్నీ చెప్పేసారా? అంటే ఆ నీడని చంపి ఆ ఉంగరం మంత్రగత్తెకి తాకించాలి అని. అలా చెబితే ఇక రాజకుమారుడు తన బుద్ధి కుశలత వాడనట్టేగా.." అంటూ చింటూ కళ్ళు పెద్దవి చేసి అడగగా "లేదురా చింటూ! దేవ దూతలు మంత్రగత్తెని చంపే మార్గం చెప్పలేదు. కేవలం కత్తి ఇంకా ముత్యపు ఉంగరం ఇచ్చారు. వీళ్ళు ఆయుధాలు ఇచ్చారు గానీ, ఎలా చంపాలో నేర్పలేదు. ఆతని సమయస్ఫూర్తి ,బుద్ధికుశలత అతన్ని గెలిపించింది. ఆతని నిస్వార్ధ ఆశయం(రాకుమారిని కాపాడాలి) నెరవేరింది. నిజ జీవితంలో కూడా అంతే ఎవరైనా మనకి వారి అనుభవాలు చెప్పి సాయపడగలరు గానీ వారు మన బదులు మన సమస్యతో యుద్ధం చేయలేరు. మన సమస్య మనమే ఎదుర్కోవాలి. వారి సలహాలు తీసుకుని ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించి ముందడుగు వేసే బాధ్యత మనదే.." అంటూ నవ్వుతూ చెప్పింది పెద్దమ్మ. "సరే అవ్వా! ఇక నేను ఇంటికి వెళ్ళాలి..వెళ్ళొస్తా" అంటూ పెద్దమ్మని వెనక నుండి గట్టిగా పట్టుకుని బుగ్గన ముద్దిచ్చి చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు. పేదరాసి పెద్దమ్మ: అదండీ సంగతీ! కథ కంచికి మనం ఇంటికీ! విన్నారుగా పాఠకులారా! మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. కాకపోతే వెళ్ళేముందు మనం నేర్చుకున్న పాఠాలు ఒక్కసారి చెప్పేసి వెళతా. ఏదో నా చాదస్తం! ★ సమస్య వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడకుండా, ధైర్యంగా బుద్ధి కుశలత ఉపయోగించి దాన్ని పరిష్కరించుకోవాలి. ★ ఎవరైనా మంచి మాటలు గానీ, వారి అనుభవాలు లేదా వాళ్ళు నేర్చుకున్న గుణపాఠాలు చెబితే వినాలి. ఆ మాటలు ఎక్కడ పనికొస్తాయో ఎవరికీ తెలీదు. ఏమంటారు? ★ పొగడ్తలకి పొంగిపోవద్దు, చులకనగా చూస్తున్నారని క్రుంగిపోవద్దు. ★తన కోపమే తనకు శత్రువు(మంత్రగత్తె), తన శాంతమే తనకు రక్ష(రాజకుమారుడు నరసింహ వర్మ) ధన్యవాదాలు నా మాటలు ఓపికగా, శ్రద్ధగా విన్నందుకు! అదే చదివినందుకు. మీకు కథ నచ్చితే వేరేవారికి కూడా కథతో నీతి చెప్పండి.. వెళ్ళొస్తాను పాఠకులారా! మళ్ళీ కలుద్దాం! 💐💐💐

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled
Comments (2)